తల్లి తండ్రులపట్ల శ్రద్ద చూపండి .  

విలువ : ప్రేమ
ఉప విలువ:సహనం,కరుణ .

                      ఒక 80  ఏళ్ళ వృద్ధుడు తన ఇంట్లో సోఫా లో  45 ఏళ్ల వయసు కల విద్యావంతుడైన కుమారునితో కలిసి కూర్చున్నాడు . ఇంతలో అకస్మాత్తుగా ఒక కాకి వచ్చి వారి ఇంటి కిటికీ ఫై వాలింది . అది ఏమిటి అని తండ్రి కొడుకుని అడిగాడు. అది ఒక కాకి అని జవాబు చెప్పాడు కుమారుడు . ఐదు నిమిషాల తర్వాత తండ్రి రెండోసారి మళ్ళీ కొడుకు ని  ప్రశ్నించాడు అది ఏమిటి ?అని . నాన్న !అది కాకి అని ఇప్పుడే  నీకు చెప్పాను . అన్నాడు కొడుకు .  

  కొంచెం సేపు తరువాత తండ్రి మూడవసారి కొడుకుని మళ్ళీ అడిగాడు అది ఏమిటి ?అని . ఈ సారి కుమారిని కంఠం లో విసుగు ,కోపం ధ్వనిస్తూ అది ఒక కాకి –ఒక కాకి అని చెప్పాడు చాలా చిరాకు తో  . మరి కొద్దిసేపటి తరువాత తండ్రి నాలుగవ సారి మళ్ళీ అడిగాడు . అది ఏమిటి?అని . ఒకటే ప్రశ్న మళ్ళీ,  మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు ?ఇప్పటికి ఎన్నిసార్లు  చెప్పాను  నీకు అది ఒక కాకి అని . చెబుతుంటే నీకు ఇది అర్థం కావడం లేదా ?అన్నాడు గట్టిగా అరుస్తూ .

            కొంచెం సేపు అయ్యాక తండ్రి తన గదిలోనికి వెళ్లి ఒక పాత నలిగిపోయి ఉన్న ఒక డైరీ ని తీసుకొచ్చాడు . తన కొడుకు పుట్టిన దగ్గర నుంచి అతను ఆ డైరీ వ్రాస్తు ఉన్నాడు . డైరీ  లో ఒక పేజీ తీసి తండ్రి తన కొడుకు ని చదవమని చెప్పాడు . కొడుకు అది చదివాడు . అందులో చాలా  వ్రాయబడి ఉన్నది . ఈ రోజు మూడేళ్ళ నా కొడుకు నాతో పాటు సోఫా లో కూర్చున్నాడు . అప్పుడు కిటికీలో ఒక కాకి వచ్చి వాలింది . మా అబ్బాయి నన్ను 23 సార్లు అడిగాడు అది ఏమిటి అని ?నేను అది ఒక కాకి అని 23 సార్లు సమాధానం చెప్పాను . అతను 23 సార్లు  నన్ను  ఆ ప్రశ్న అడిగిన ప్రతీసారి నేను నా కొడుకుని ప్రేమతో కౌగిలించుకున్నాను . నాకు నా కొడుకు అన్నిసార్లు ఒకటే ప్రశ్న అడిగినా నాకు విసుగు ,కోపం రాలేదు సరికదా అతని పట్ల అతని అమాయకత్వం పట్ల చాలా ప్రేమ కలిగింది . చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కొడుకు 23 సార్లు అది ఏమిటి ?అని అడిగినా తండ్రి కి   విసుగు ,చిరాకు కలగలేదు ,కానీ ఈ రోజు తన తండ్రి అదే ప్రశ్న నాలుగు సార్లు అడిగేసరికి కొడుకుకి చాలా విసుగు ,అసహనం కలిగాయి .

                     కాబట్టి  మీ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు వారిపట్ల చిరాకు పడకండి . వాళ్ళని ఒక భారంగా భావించకండి . వారితో ప్రేమతో ,వినయంతో ,దయతో ,గౌరవంతో మాట్లాడండి . ఈ నాటి నుండి మీ తల్లిదండ్రుల పట్ల చాలా శ్రద్ధతో ,ప్రేమతో వ్యవహరించండి .

నేను నా తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటున్నాను . చిన్న వయసు నుంచీ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమతో పెంచారు . ఎల్లప్పుడూ వాళ్ళు నా యందు నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు . పర్వతాలను ,లోయలను ,తుఫానులను , వేడిని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు నన్ను ఈ నాడు సంఘంలో ఒక ప్రయోజకునిగా తీర్చిదిద్దారు . అని గట్టిగ మీరు అనుకోండి . భగవంతుని ప్రార్థించండి . :భగవంతుడా !నేను నా తల్లిదండ్రులకు అత్యుత్తమమైన సేవలు అందిస్తాను . ఎంతో ప్రియమైన నా తల్లిదండ్రుల తో ఎటువంటి పరిస్థితుల్లో నైనా ఎక్కడ ఉన్నా ,అన్ని విధాలా ప్రేమతో ,దయతో ,మంచి మాటలనే మాట్లాడుతాను .

నేర్వవలసిన నీతి : తల్లితండ్రులు వార్ధక్య దశలో (ముసలి తనంలో ) ఉన్నప్పుడు వారిని చులకన గానో ,ఒక భారంగా భావించకండి . వారితో ఆప్యాయంగా మాట్లాడండి . శాంతంగా ,వినయంగా దయతో వారిపట్ల ప్రవర్తించండి .వాళ్ళ పట్ల భద్యతతో ,శ్రద్ధతో మెలగండి . ఈ రోజు నుంచి గట్టిగా ఇలా చెప్పండి .

“ నా తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటున్నాను. చిన్న వయసు నుండి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమతో పెంచారు . ఎల్లప్పుడూ వాళ్ళు నా యందు నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు . పర్వతాలను ,లోయలను ,తుఫానులను , వేడిని … ఇలా జీవితం లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ నన్ను ఈ నాడు సంఘం లో ఒక ప్రయోజకునిగా తీర్చిదిద్దారు . అని తలచుకుంటూ ఉండండి .

శ్రీకృష్ణ మరియు అర్జున.

          విలువ : సత్యం 
ఉప విలువ   : జ్ఞానం .

భగవద్గీత లోని మొట్ట మొదటి అధ్యాయం కౌరవులపై యుద్ధం చేస్తున్న పాండవ సేనను నడిపించే అర్జునునికి సంబందించినది . కౌరవ సైన్యం లో పాండవుల దాయాదులైన పెదతండ్రులు, పినతండ్రులు ,మామలు అనేకమంది బంధువులు ,ఆచార్యులు ,గురువులు , పూజ్యులైన పెద్దలు ,అనేకమంది రాజులు , చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సామంత రాజులు ఉన్నారు . అర్జునుని సైన్యం లో కూడా అతని సోదరులు ,దాయాదులు ,మామలు అనేక మంది బంధువులు ,ఆచార్యులు ,గురువులు పూజ్యులైన పెద్దలు అనేక మంది రాజులు ,చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సామంత రాజులు ఎందరో ఉన్నారు.
శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునికి మార్గదర్శనం చేస్తూ సహాయ పడుతున్నాడు. మరి కొద్ది సేపటిలో కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావలసి ఉన్నది. అర్జునుడు, శ్రీ కృష్ణ భగవానుని యుద్ధ రంగం మధ్యకు తీసుకువెళ్ళమని ,తాను యుద్ధం ఎవరెవరితో చేయబోతున్నాడో చూస్తానని అన్నాడు . తీరా యుద్ధరంగం మధ్యకి వెళ్తే అక్కడ తాను యుద్ధం చేయబోతున్న వారంతా తన బంధువులు ,స్నేహితులే, పరిచయస్తులే . వారందరినీ చూసిన అర్జునునికి విపరీతమైన బాధ కలిగింది , శరీరమంతా కంపించింది . ఈ విధంగా అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు.

భగవద్గీత లోని మొట్ట మొదటి అధ్యాయం కౌరవులపై యుద్ధం చేస్తున్న పాండవ సేనను నడిపించే అర్జునునికి సంబందించినది  . కౌరవ సైన్యం లో పాండవుల దాయాదులైన  పెదతండ్రులు, పినతండ్రులు ,మామలు అనేకమంది బంధువులు ,ఆచార్యులు ,గురువులు , పూజ్యులైన పెద్దలు ,అనేకమంది రాజులు ,  చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సామంత రాజులు ఉన్నారు .  అర్జునుని సైన్యం లో కూడా అతని సోదరులు ,దాయాదులు ,మామలు అనేక మంది బంధువులు ,ఆచార్యులు ,గురువులు పూజ్యులైన పెద్దలు అనేక మంది రాజులు ,చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సామంత రాజులు ఎందరో  ఉన్నారు. 

                          శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునికి మార్గదర్శనం చేస్తూ సహాయ పడుతున్నాడు.  మరి కొద్ది సేపటిలో కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావలసి ఉన్నది. అర్జునుడు, శ్రీ కృష్ణ భగవానుని యుద్ధ రంగం మధ్యకు తీసుకువెళ్ళమని ,తాను యుద్ధం ఎవరెవరితో చేయబోతున్నాడో  చూస్తానని అన్నాడు .  తీరా యుద్ధరంగం మధ్యకి వెళ్తే  అక్కడ తాను యుద్ధం చేయబోతున్న వారంతా తన బంధువులు ,స్నేహితులే, పరిచయస్తులే . వారందరినీ చూసిన  అర్జునునికి విపరీతమైన బాధ కలిగింది , శరీరమంతా కంపించింది . ఈ విధంగా అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు.       

                        తనకి యుద్ధం చేయాలన్న ఆలోచన పోయిందనీ , ఒకవేళ శత్రువులే యుద్ధం చేసి తనని  చంపడానికి వచ్చినా తనకి యుద్ధం చేసి, వారిని చంపాలని లేదని అన్నాడు. యుద్ధం చేయటం లో ప్రయోజనం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నాడు .  యుద్ధం  చేసి రాజ్యాధి కారమును పొందడం కానీ , వీరమరణం పొంది స్వర్గములో కీర్తిని పొందటం కానీ సరైన పని కాదు. తన వారందరినీ చంపుకుని పొందే రాజ్యం తనకి అక్కరలేదని అర్జునుడు చాలా బాధపడ్డాడు . అయోమయ స్థితిలో ఏమి చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితిలో తన ఆయుధాలన్నింటినీ  క్రింద పడవేసి యుద్ధం చేయను .. చేయలేను అంటూ అర్జునుడు రథం లో కూలబడి పోయాడు.      

                ఆ విధంగా మాట్లాడుతూ అర్జునుడు యుద్ధ రంగం మధ్యలో తన వింటిని ,బాణములను రథం లో విసిరేసి కూర్చున్నాడు . దుర్భరమైన విషాదం తో ,గొప్ప నైరాశ్యంతో అశక్తుడివలె అర్జునుడు రథంలో ఆసనం పై  కూలబడ్డాడు . అతని మనసు వికలమై పోయింది.  అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయుధాలను ఆ విధంగా విసిరేసి యుద్ధం చేయనని అలా  అనడం సరైన పద్ధతి కాదని కృష్ణుడు అర్జునునితో  అన్నాడు . ఈ విధంగా యుద్ధము చేయననటం అర్జుని వంటి యోధునికి తగదని, అది అతనికి ,అతని వంశమునకు కూడా అపకీర్తిని తెస్తుందని ,కాబట్టి ధైర్యంగా లేచి నిలబడి యుద్ధమునకు సిద్ధం కమ్మని శ్రీకృష్ణుడు అర్జునుని ప్రోత్సహించాడు . రక్తపాతాన్ని ఊహించలేనని ,స్వజనులు మరణించడాన్ని తాను భరించలేనని అటువంటి భయంకర రక్తపాతంతో లభించే విజయం ,రాజ్యం తనకి అక్కర్లేదని ఒక విధమైన స్తబ్దతతో  , విపరీతమైన నైరాశ్యంతో కృంగిపోయిన మనసుతో అర్జునుడు దైర్యమును కోల్పోయాడు . సరిగ్గా ఈ సమయంలోనే కృష్ణ భగవానుడు జననం  గురించి ,మరణం గురించి అనేక విషయములను తెలియజేస్తూ వేదాంత రహస్యములను తెలియజేస్తూ ప్రప్రధమంగా గీత బోధ చేశాడు . 

           అసలైన జ్ఞానం అంటే ఏమిటో ఆత్మ యొక్క స్వభావం ఏమిటో  ,జ్ఞానానికి ,అజ్ఞానానికి తేడా ఏమిటో, స్వధర్మము పాటించడం ఎంత ముఖ్యమో , కర్మ యోగ సిద్ధాంతం అనగా ఏమిటో ఈ విధంగా అనేకమైన విషయములను గురించి శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుకి బోధించాడు . విచక్షణా జ్ఞానముతో ప్రవర్తించమని చెపుతూ శ్రీకృష్ణుడు అర్జునుని కి  ఏర్పడిన అయోమయ స్థితి నుండి బయట పడవేసే ప్రయత్నం చేశాడు  . తనకి కలిగిన అయోమయస్థితిని జాలి అనుకుని అర్జునుడు పొరబడుతున్నాడని  , కృష్ణుడు అర్జునునికి తెలియ పరిచాడు .అర్జునుడు పైకి తెలివిగా మాట్లాడినట్లు అనిపించినా అసలైన జ్ఞానులు, జీవించి ఉన్నవారిని గురించి కాని  ,మరణించిన వారి గురించి కాని  శోకించరని  అన్నాడు. ఏది సత్యమో  ,ఏది అసత్యమో ,ఏది నిత్యమో  , ఏది అనిత్యమో తెలుసుకోగలటమే జ్ఞానము . జీవ యాత్ర నిరంతరమైనది . పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు . మరణించిన జీవులు మరల పుట్టక తప్పదు . జీవులు జనన మరణ చక్రంలో తిరుగుతూ ,పుడుతూ ,పెరుగుతూ ,వయసు పెరిగిన కొద్దీ వృద్ధాప్యము పొందుతూ చివరకు మరణించి మరొక నూతన దేహాన్ని స్వీకరించి పుడుతూ ఉంటారు . 

    అసలైన జ్ఞానము ఈ జనన మరణములనే మోహంలో చిక్కుకొనదు. ద్వందములతో  కూడిన ఈ ప్రపంచంలో మానవ జీవితమంతా సుఖ దుఃఖములు ,శీతోష్ణములు మొదలైన ద్వంద్వములతో  చుట్టుకుని ఉంటుంది. ఇవన్నీ కూడా అనిత్యములే. ఈ అశాశ్వతమైన వాటిని గురించి విచారించకూడదని అర్జునునికి శ్రీ కృష్ణుడు భగవద్గీత ద్వారా బోధించాడు. అసత్యము శాశ్వతముగా ఉండదు . శాశ్వతమైన సత్యము ఎన్నటికీ నశించదు . అందరిలోనూ అన్నిటియందు వ్యాపించి ఉన్నది ,  శాశ్వతమైన సత్యము మాత్రమే .నిత్య సత్యము ,శాశ్వతము అయిన పరమాత్మ  మాత్రమే . 

     ఆత్మ పాంచభౌతిక మైన శరీరములచే ఆవరించబడి ఉంటుంది . కాని దేహము నశించినపుడు ఆత్మ దేహము తో పాటు నశించదు . చినిగిన వస్త్రములను విడిచి పెట్టి నూతన వస్త్రములను ఏ విధంగా మనము ధరిస్తూ ఉంటామో అదే విధంగా ఆత్మ నూతన దేహములను స్వీకరిస్తూ ఉంటుంది . కావున జ్ఞానులు శరీరమును విడిచిపెట్టినప్పుడు వారికొరకు దుఃఖించరు . ఈ మృతువు అనే మాయలో జ్ఞానులు పడరు . ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఆత్మ ఒకపుడు ఉండునది ,ఒకపుడు ఉండనట్టిది కాదు . ఆత్మకి పుట్టుక లేదు . ఆత్మ శాశ్వతము . మరణించునట్టిది కాదు ,నిత్యమైనట్టిది . దేహముతో పాటు  ఆత్మ నశించదు . 

నేర్వవలసిన నీతి :
యుద్ధ రంగమంటే ఇరు పక్షాల సైన్యం నిలబడి ఆయుధాలతో చేసేటువంటిది మాత్రమే కాదు . మన నిజజీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలతో చేసేది కూడా ఒక విధమైన యుద్ధమే . మనం చేసే యుద్దములో మనలోని ”పాజిటివ్” లక్ష్యములు ,ఆశలు ,కోరికలు మన కుటుంబం పట్ల ,సమాజం పట్ల మనం నెరవేర్చవలసిన కర్తవ్యములు ,బాధ్యతలు ఒకవైపున , మరొక వైపున మనలోని చేడు గుణములు , ప్రలోభ పరచే ఆకర్షణలు మధ్య పోరాటం జరపవలసి వస్తూఉంటుంది .
మన ఎదురుగా ఉన్న సమస్యల సమూహాలను చూసి మనం కంగారు పడిపోతూ ఉంటాము . మన ధర్మం ,మన కర్తవ్యం ,మనం చేసే పనుల వలన కలగబోయే ఫలితములు ,ఇతరులు మన పట్ల వ్యవహరించే తీరు వలన ఏర్పడే కొన్ని సంఘర్షణలు మొదలైన వన్నీ ఆలోచించినప్పుడు చాలా అయోమయానికి ,స్తబ్దత కు లోనవుతాము. అటువంటి స్థితిలో మనం సహాయం కోసము ,సలహా కోసం ఎదురు చూస్తాము . అర్జునుని వలె మనపై దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు ఒక సద్గురువు మన జీవితంలో ప్రవేశించి ఏదో ఒక రూపం లో మనకి మార్గదర్శనం చేయించి సత్యమునకు ,అసత్యమునకు ,యదార్ధమునకు, మిథ్యకు తేడాను అర్థం చేసుకునే విధంగా బోధిస్తాడు.
.

అహం కారం దాని ప్రభావం

saibalsanskaar telugu

image.jpegఅహం అనే శబ్దము నకు నేను అని అర్ధం అందరి కంటే నేనే గొప్పవాడిని లేదా నేను మాత్రమే అందరి కంటే గొప్పగా ఉండాలి అని ఈ భావననే అహం అని నిర్వచించ వచ్చు ఇది మన జీవితానికి చేసే చెడు ఇంతా అంతా కాదు ఈ భావన నుంచి బయట పడగలిగితే జీవితం లో అంతకంటే ఆనందం మరేదీ ఉండదు ఈ ప్రభావానికి లోనైతే ఇంత కంటే నరకం కూడా మరొకటి ఉండదు

చాల నిరుత్సాహం కలిగించే ఒక విషయం ఏమిటంటే విజయాలను సాధించా మని భావించే వారు, ప్రముఖ వ్యక్తులు చేసే పనులు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షించ డానికే చేస్తారు. వాళ్ళు కూడా అహం అనే సంకెళ్ళ నుంచి బయట పడలేరు అహం అనే చెడ్డ గుణం సహజంగా తనను పెంచి పోషించే వాళ్ళకోసం వెతుక్కుంటూ ఉంటుంది అందువల్ల అదో పెద్ద ముష్టిది అహం అనే చెడ్డ గుణం తో ఉన్న సమస్య ఏమిటంటే దాన్ని మనం పెంచి పోషిస్తే మనలో నేనే గొప్ప అనే భావం (superiority complex) ప్రబలుతుంది దాన్ని అసలు పట్టించు కోకుండా వదిలేస్తే మనలో ఆత్మ న్యూనతా భావం (inferiority complex) బయలు దేరు తుంది ఎలా చూసినా అది మనకు మన శ్శాంతి లేకుండా చేస్తుంది అహం మననుంచి కోరే మూల్యం ఏమిటంటే మన మన శ్శాంతి. దువ్వెన కొనుక్కోడానికి జుట్టు…

View original post 282 more words

చేతనైనంత సహాయం చెయ్యండి

saibalsanskaar telugu

విలువ : ప్రేమ

అంతర్గత విలువ: దయ

ఒక పరిచారిక చాలా అలసట, బాధతో ఉన్న ఒక పెద్దాయన మంచం దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళింది. ‘మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు’ అని ఆ పెద్దాయనకి చెప్పింది. చాలా సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది, రోగి కళ్ళు తెరిచే లోపల.

రోగి గుండె నెప్పితో బాధ పడటం వల్ల, ఎక్కువ మోతాదు మత్తు మందు ఇవ్వటం జరిగింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే, తన మంచం పక్కన, మంచి దుస్తులు వేసుకున్న ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. పెద్దాయన , తన చెయ్యి బయటికి పెట్టారు, అప్పుడు ఆ అబ్బాయి కూడా,
చెయ్యి ప్రేమతో పట్టుకున్నాడు. అప్పుడు పరిచారిక, ఆ అబ్బాయికి ఒక కుర్చీ తెచ్చి వేసింది.nu219002 రాత్రంతా ఆ అబ్బాయి మంచం పక్కనే, పెద్దాయన చెయ్యి ప్రేమతో పట్టుకుని, కబుర్లు చెబుతూ, ధైర్యాన్ని ఇచ్చాడు. కొంచెంసేపు అయ్యాక, పరిచారిక, ఆ అబ్బాయిని విశ్రాంతి తీసుకోమని అడిగింది, కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు.

అప్పుడప్పుడు ఆ పెద్దాయన, ఏదో మాట్లాడినట్టు అనిపించేది. కానీ చూస్తే, ఆ అబ్బాయి చెయ్యి, రాత్రి అంతా గట్టిగా పట్టుకునే ఉన్నారు.
తెల్లవారుజామున, పెద్దాయన కన్ను మూశారు. ఆ అబ్బాయి వెళ్ళి పరిచారికకి, తెలియ చేశాడు.

పరిచారిక అన్ని పనులు పూర్తిచేసుకుని వచ్చేదాకా, ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు.పరిచారిక,ఆ అబ్బాయిని ఓదారుస్తూ ఉండగా, ఆ అబ్బాయి…

View original post 110 more words

నల్ల చుక్క   

saibalsanskaar telugu

విలువ:సత్యం

ఉపవిలువ:కృతజ్ఞత ,ఆశాభావము

black-dotఒక రోజు ఒక ఉపాధ్యా యుడు   కళాశాలలోని పిల్లలకి ముందుగా తెలుపకుండా,  అకస్మాత్తుగా ఒక పరీక్ష పెట్టారు . పిల్లలందరూ పరీక్షలో ఏమడుగుతారో , పరీక్ష ఎంత కష్టంగా  ఉంటుందో అని ఆందోళన పడ్డారు. అధ్యాపకుడు పరీక్షా పత్రాలను పిల్లలలో పంచారు. అయితే పత్రాలు తలకిందగా ఉండడంతో అందులో ఏమి రాసుందో పిల్లలకి కనబడలేదు. అందరికీ పత్రాలు అందాక ఉపాద్యాడు పిల్లలను ప్రశ్నల పత్రాలను తిప్పి చూడమని ఆదేశించారు. తీరా చూస్తే అందులో ఒక్క  ప్రశ్న కూడా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. మాస్టారు ,వాళ్ళని ఆ పత్రాలలో వాళ్లకి ఏమి కనిపించిందో వివరంగా రాయమన్నారు. ప్రొఫెసర్ ఆదేశానుసారం విద్యార్థులు వారికి అందులో కనిపించిన “నల్ల చుక్క” గురించి రాశారు.

                              తరగతి పూర్తి అయ్యాక మాస్టారు పిల్లలు రాసిన జవాబులన్నింటినీ గట్టిగాచదివారు. అందరూ వారికి కనిపించిన నల్ల చుక్క గురించి, కాగితంలో దాని స్థానం  గురించి వారివారి మాటలలో వివరించారు.అందరి జవాబులను చదివాక మాస్టారు విద్యార్థులకు ఈ విధానంగా బోధించారు “విద్యార్థులారా! భయపడకండి, నేను ఈ పరీక్షకి మార్కులు ఇవ్వబోటంలేదు. ఈ అభ్యాసం  ద్వారా మీకు ఒక చక్కటి జీవిత సత్యాన్ని బోధించి, జీవితం పట్ల మీ అవగాహనని మార్చాలనుకున్నాను. మీరంతా ఆ పత్రాలలో…

View original post 128 more words

   మనం చేసుకొనే స్నేహం

 

విలువ :      ధర్మము

ఉప విలువ : విచక్షణ.

swan

ఒకానొకప్పుడు ఒక హంస ,ఒక కాకి స్నేహం గా ఉండేవి. ఒక రోజున కాకి హంసను తన ఇంటికి తీసుకోని వెళ్ళింది. ఒక ఎండిన చెట్టు మోడుపై అవి కూర్చున్నాయి. ఆ ప్రేదేశమంతా పేడ మాంసము ,ఎముకలు అన్ని చెల్లా చెదురుగా పది ఉండి దుర్వాసన వస్తున్నది. హంస కాకితో సోదరా ! ఇటువంటి మురికి ,దుర్గంధ ప్రదేశం లో నేను క్షణికాలం కూడా ఉండలేను. నన్ను ఏదయినా పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది.

crow

అందువల్ల కాకి హంసను రాజుకు చెందిన ఒక చెట్టు తొర్రలో రహస్యంగా కూర్చోబెట్టి తాను కూడా హంస పక్కనే కూర్చుంది. క్రిందికి చూస్తే హంసకి రాజుగారు చెట్టుకింద కూర్చొని ఉండటం ఆయనకి తలకి బాగా ఎండతగులుతూ ఉండటం కనిపించింది. సాదు స్వభావం కల హంస ఎంతో దయతో తన రెక్కలు విప్పి రాజుకు ఎండతగలకుండా నీడను కల్పించింది. దానివల్ల రాజు కి కాసేపు సుఖం కలిగింది. ఈ లోగా కాకి తన సహజ నిర్లక్ష్య స్వభావంతో రెట్ట వేసింది. అది సరిగ్గా రాజు గారి తలమీద పడింది. రాజు కోపంతో వెంటనే పైకి బాణం వేసేసరికి అది హంసకి తగిలి అది క్రింద పడిపోయంది.

                                      హంస చనిపోతూ ఓ రాజా ! నీపైన రెట్ట వేసింది కాకి నేను కాదు.  ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన నీటిలో జీవించే హంసను నేను .కానీ చెడ్డ కాకితో చేసిన స్నేహం వలన నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని ధుఃకించింది.

   నీతి : మంచితనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అదే విధంగా చెడ్డతనం కూడా మనుషులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచివారితో మాత్రమే స్నేహం చేసి సత్సాగత్యం లో మెలగాలి. మంచివారితో సాంగత్యం మనుషులపై మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. చెడ్డవాతావరణం లో తిరిగే మంచి వారి లోని మంచి గుణాలను ఎవరు గుర్తించరు. చెడ్డవ్యక్తి తోటి స్నేహం వలన మంచివారు కూడా చెడుఫలితాలను అనిభవించవలసి వస్తుంది.

The Company One Keeps

భగవంతుడు గొప్పా ? భగవంతుడి నామము గొప్పా?

విలువ – సత్యం
అంతర్గత విలువ – నామస్మరణం

hnuman

పదునాలుగు సంవత్సరముల వనవాసం పూర్తిచేసి, శ్రీరాముడు అయోధ్యకి తిరిగివచ్చాడు.

అదే సమయంలో కొంత మంది మహర్షులు, నారదులు వారి వద్దకి వెళ్లి, “భగవంతుడు గొప్పా ? భగవంతుడి నామము గొప్పా?, అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి జవాబు కొన్ని రోజుల తరువాత చెబుతాను”, అని చెప్పారు నారదుల వారు.

నారదుల వారు ఆలోచించి, హనుమంతుడే దీనికి జవాబు చెప్పగలరు అని అనుకున్నారు.హనుమంతుని వద్దకు వెళ్ళి ఈ ప్రశ్నకి సమాధానము కనుగొనుటలో తనకి సహాయం చేయమని కోరారు. దానికి హనుమంతుల వారు అంగీకరించారు.

నారదుల వారు, హనుమంతుడిని ,”శ్రీ రాముడి గురువు అయిన విశ్వామిత్రునికి కోపము వచ్చేటట్టు ప్రవర్తించు, అప్పుడు నిన్ను శిక్షించమని విశ్వామిత్రుడు, శ్రీ రాముడిని ఆజ్ఞాపిస్తారు”, ఆ తరవాత సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పారు.

హనుమంతుడు వింతగా ప్రవర్తించి, విశ్వామిత్రుడికి కోపం తెప్పించారు. విశ్వామిత్రులవారు,”మహాత్ములు అందరి మధ్యలో, హనుమంతుడిని శిక్షించమని, శ్రీ రాముడిని ఆజ్ఞాపించారు.” హనుమంతుని పై బాణమును గురి పెట్టి ,గురువుకి కోపం తెప్పుస్తే, ఏమి జరుగుతుందో అందరికీ తెలిసేలా చేయమని చెప్పారు.

శ్రీ రాముల వారు కూడా హనుమంతుడి ప్రవర్తన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కానీ గురువాజ్ఞని పాఠించక తప్పదని ,బరువైన గుండెతో రాజభవనంలోకి వెళ్లిపోయారు.

మరుసటి రోజు అందరూ నదీ తీరము వద్ద వేచి ఉన్నారు. శ్రీ రాముడు,హనుమంతుడిని శిక్షించడానికి బాణం, వేస్తే అన్ని బాణములు గురి తప్పి పక్కకి పడిపోయాయి. అందుకు కారణం ‘రామ నామం ‘ జపం. హనుమంతుడు ఎంతో శ్రద్దగా,భక్తితో ,రామ నామమును జపించటం వలన తన వైపు దూసుకొచ్చిన ప్రతి బాణం పక్కకు తప్పిపోయింది.

విశ్వామిత్రుల వారు , శ్రీ రాముడిని తన ‘బ్రహ్మాస్త్రమును’ ఉపయోగించమని ఆజ్ఞాపించారు. నారదులవారు ముందుకు వచ్చి,” ‘ఓ బ్రహ్మర్షి విశ్వామిత్రా, మీరు ఎంతో దయ గల గురువులు, హనుమంతుడిని క్షమించి ,మీ ప్రేమను ,క్షమాగుణాన్ని ,చూపండి “,అని సున్నితంగా చెప్పారు. విశ్వామిత్రులవారు హనుమంతుడిని క్షమించారు.

నారదులవారు, మహర్షులందరిని పిలిచి ,”ఇప్పుడు మీ అందరికి ,భగవంతుడు గొప్పా ? భగవంతుడి నామము గొప్పా?తెలిసిందా ,ఖచ్చితంగా
భగవంతుడి నామమే!

నీతి:
ఈ కథ భగవంతుడి నామం యొక్క విశిష్టత గురించి చక్కగా తెలియపరుస్తుంది. . శ్రీమామచంద్రుని పట్ల హనుమంతులవారి భక్తి మరియు వినయవిధేయతల గురించి కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.

మనం కూడా నిరంతరం భగవంతుడి నామమును జపిస్తే, అన్ని కష్టాలనుంచి రక్షింపబడతాము.

మూలము
http://www.bhagavatam-katha.com/holy-name-story-who-is-greater-lord-almighty-or-his-divine-name//

Who is Greater – Lord Almighty or His Divine Name?

అహంకారం అతి పెద్ద శత్రువు

images

విలువ:  ధర్మం, సత్ప్రవర్తన
అంతర్గత విలువ : అహంకారం లేకుండా ఉండడం

ఒకప్పుడు ఇద్దరు అబ్బాయిలు చాలా స్నేహంగా ఉండేవారు.  పెరిగి పెద్దయిన తరువాత జీవితంలో స్థిరపడడానికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.  ఒక అబ్బాయి తన కాలాన్నంతా ఆధ్యాత్మిక సాధనలో గడిపి ఋషిగా మారి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు.  ఇంకొక అబ్బాయి   బాగా డబ్బు సంపాదించి ధనవంతుడై విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.   

 ఒకసారి ఈ ధనవంతుడికి తన మిత్రుడు ఎలా ఉన్నాడో , ఎక్కడ ఉన్నాడో  తెలుసుకోవాలి అనిపించింది.  ఎంతో ప్రయత్నం చేసి చివరకు వివరాలు సంపాదించాడు. తన మిత్రుడు తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు.  ఋషిగా మారిన మిత్రుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఋషి కూడా అందుకు అంగీకరించాడు.

ధనవంతుడు తన మిత్రుడు వస్తున్నాడని ఆనందంతో ఇల్లంతా అలంకారం చేయించాడు.  నడవడానికి సౌకర్యంగా ఉండేలా ఇల్లంతా ఖరీదైన తివాచీలు పరిచాడు.  ఋషి వచ్చి ఈ ఏర్పాట్లు అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.  సంతోషంతో లోపలికి వస్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఋషితో, మీ మిత్రుడు తనకి డబ్బు ఉందని అహంకారంతో, మిమ్మల్ని అవమానించడానికే  ఇవన్నీ చేసాడు అని చెప్పాడు.  ఈ మాట విన్న ఋషికి చాలా కోపం వచ్చింది.  వెంటనే రోడ్డు మీదకి వెళ్ళి మురికి కాలువలో కాళ్ళు పెట్టి వచ్చి ఆ మురికిని తివాచీల నిండా అంటించాడు.  ధనవంతుడు తన స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించాడు. కానీ ఋషి, ధనవంతుడితో నీకు ఎంతో డబ్బువుండవచ్చు కానీ, నాకున్న జ్ఞానం చాలా గొప్పది. ఏ  విధంగా చూసినా నేనే నీకంటే గొప్పవాడిని అన్నాడు. కావాలనే నీ తివాచీలకు మురికి అంటించాను అని చెప్పాడు. 


అది విన్న ధనవంతుడు ఓ స్నేహితుడా; నిన్నుచూసి నేను చాలా గర్వపడ్డాను. నా స్నేహితుడు ఇంత జ్ఞానం సంపాదించాడు అని సంతోషించాను. కానీ ఎంత జ్ఞానం ఉన్నా కోపాన్ని జయించలేకయావు. నేను ధనవంతుడిని కాబట్టి డబ్బు సంపాదించానన్న గర్వం ఉండడం సహజం కానీ ఋషి అంటే ఇంద్రియాలను జయించి, మనసుని గెలిచినవాడు అని అర్థం కదా. ఇన్ని  సంవత్సరాలు సాధన చేసి కూడా నీ మనసులోని వ్యతిరేక భావాలకు లొంగిపోయావు  అంటే నీవు  నిజమైన ఋషివి  కాదు అన్నాడు. 

   నీతి: మనకున్న జ్ఞానం, సంపద అంతా భగవంతుడి దయ వలన వచ్చినవే.  ఆ విషయం గుర్తు పెట్టుకుని భగవంతుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం అనేది అతి పెద్ద శత్రువు. మనమే అన్నీ చేసాము అనుకోవడమే అహంకారం. ఇతరులను చూసి అసూయ పడకుండా మనకి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీర,మనసు, ఆత్మల వల్ల  మాత్రమే మన జీవితం సాగించగలుగుతున్నాము.

ప్రేమయే తీర్థయాత్ర

saibalsanskaar telugu

విలువ : ప్రేమ

అంతర్గత విలువ : దయ

man-and-dog1హజ్రత్ ఝునైద్ బాగ్దాది, మక్కా  తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు , బాగా గాయపడినకుక్కను  చూశాడు. దానికి  బాగా దెబ్బలు తగిలి,  నాలుగు కాళ్ళు కూడా గాయ పడ్డాయి.  ఎంతో రక్తం కూడా పోయింది . అప్పుడు హజ్రత్ కుక్కని,  పక్కనే ఉన్న బావి దగ్గరికి తీసుకుని వెళ్ళేడు. దెబ్బలను, నీటితో కడిగి ఆ గాయాలకు కట్టు కట్టాడు.  హజ్రత్ బట్టలు మరియు ఒళ్ళు మొత్తము రక్తంతో తడిసిపోయాయి . కాని అతను తన గురించి ఏమీ పట్టించుకోలేదు. కుక్కని తీసుకుని, ఎడారిలోనడుచుకుంటూ వెళ్తున్నప్పుడు,  అతనికి దారిలో ఒక చోట చిన్న ఒయాసిస్ కనిపించింది.

             తీరా చూస్తే ,నీళ్ళు తోడడానికి అక్కడ ఒక బకెట్ కాని, తాడు కాని లేదు.  అప్పుడు దగ్గరలో ఉన్న, ఎండు ఆకులతో ఒక చిన్న బకెట్ తయారు చేశాడు. తన తలగాపాగాను కూడా తాడుగా వాడాడు  కాని, పొడుగు సరిపోలేదు . తోడటానికి బావిలో నీరు  అందలేదు. అందుకని తను వేసుకున్న చొక్కాను కూడా తీసి  ఆ తలపాగాకి కట్టాడు, ఇంకా నీరు అందలేదు అప్పుడు తన ప్యాంటుని  కూడా వాడి తాడు యొక్క పొడుగుని పెంచేడు .మొత్తానికి ఈ సారి నీరు అందింది.

       దాంతో నీరు, తోడి హజ్రత్ కుక్క యొక్క  గాయాలను బాగా కడిగి కట్టు కట్టాడు. కుక్కను జాగ్రత్తగా ఎత్తుకుని ఊరి…

View original post 106 more words

తల్లిదండ్రులని గౌరవించండి

పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి!

IMG_4395

విలువ :ధర్మం

ఉపవిలువ : సత్ప్రవర్తన

*చిన్న‌ సంఘటన.*

పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.* ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*

తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

*ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.*

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

*భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.*

అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.

*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*

అప్పుడు *తండ్రి నవ్వి…. పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

*పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

*పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.*

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.

*ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

*భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.*

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

*రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.*

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.*

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*

ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

*భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*

నీతి :తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

*తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు.*